2, ఏప్రిల్ 2026, గురువారం

దేవాంగ పురాణం {54}

విశ్వజనాంగుడిగా దేవలుడు 

అందువలన విశ్వ వస్త్ర సృష్టి కర్తగను, విశ్వ వస్త్ర ప్రదాతగను, విశ్వ వస్త్ర నిర్మాణ ప్రదాత గాను దేవాంగః అను దానితో పాటు మానవాంగః, విశ్వ జనాంగః అని పరి విధములుగా కీర్తింప వచ్చును...

ఆ తరువాత దేవలుడు తన నిజ పట్టణమైన ఆమోద పట్టణమునకు వచ్చి తన పట్టణములో వున్న జనులందరకు వస్త్రములు ఇచ్చినాడు, ఇచ్చట దేవలుని విశాల భావము శ్లాఘనీయముగా వున్నది...

ఎందువలనంటే అన్ని ప్రాంతములు, సకల జనులకు వస్త్రములను ఇచ్చి సంతోష పరచిన తరువాతనే తను పాలించు ప్రాంత జనులకు వస్త్ర ప్రదానము చేసినాడు, అందరి సంతోషములోనే తన సంతోషము ఉన్నది అను భావనకు ఇది చిహ్నముగా భావించ వచ్చును...

దేవలుడు వస్త్రములు ఇవ్వగా ఆమోద పట్టణ వాసులు, మంత్రులు, బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మరియు ఇతర జాతుల వారును ప్రీతితో వస్త్రములను ధరించి రాజ శ్రేష్టుడగు దేవాంగ ముని వలన మిక్కిలి సంతోషము పొందితిమి అని భావించినారు...

మహా బుద్ది కుశలత కలిగి వుండి సకల సంపదలచేత తులతూగుతున్న దేవాంగ మునీశ్వరుడు ధర్మబుద్ధి కలిగిన వాడైనందున ఈ ప్రకారముగా మూడు లోకముల వారికి దోవతులు, చీరలు ఇచ్చి ఎల్లవారి అభిమానమును కాపాడినాడు, వారందరు సంతోషముగా నుండవలెనను మనస్సు గలవాడు అయినందున మిక్కిలి కీర్తిని పొందినాడు...

దేవలుడు దేవతలందరికి వస్త్రములను ఇచ్చినాడు, దేవలుడు ఇచ్చిన వస్త్రములను తమ శరీరమునకు ధరింపజేసి అలంకారముగా కనపడిరి, దేవతల శరీర అంగములు దేవలుని దివ్య వస్త్రములతో అలంకరింప బడినందున ఆ అలంకారినికి దేవలుడే మూల కారకుడు కాబట్టి దేవలున్ని దేవాంగుడు అని పిలిచినారు...

మానవ జాతి మొత్తానికి దేవలుడు తాను నేసిన వస్త్రములను వారు కోరిన విధముగా వివిధ వన్నెలతోను,చిత్రవిచిత్ర వర్ణములతోను కూడివుండిన వస్త్రములు జంబూ ద్వీపము మొదలగు నవ విధ ద్వీపములలో నున్న మానవ జాతి మొత్తానికి ఇచ్చినాడు...

ఈ మానవ జాతి మొత్తము దేవలునిచే ఇవ్వబడిన వస్త్రములను తమ శరీరమునకు అలంకరించుకొని తమ నగ్నత్వమును పారద్రోలినారు, వారు నూతన దివ్య వస్త్రములతో అలంకరించుకొనుట వలన వారి శరీరములు మిక్కిలి అందముగా కనబడినవి...

అందువలన మానవ అంగాలను తన వస్త్రముతోటి అలంకరింప జేయుట వలన దేవలున్ని మానవాంగః లేదా మానవాంగుడు అని కొనియాడవచ్చును...

ఈ సృష్టిలో సకల జాతుల వారందరికీ అనగా దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలగు దేవజాతుల వారికే గాక మానవ, నాగ, రాక్షస జాతుల వారికి కూడా అనగా ఈ సృష్టిలో సమస్త జాతుల వారికి దివ్య వస్త్రములు నేసి వారి దగ్గరకు వెళ్లి, స్వయముగా వస్త్రములు ఇచ్చినాడు, వారందరి చేత ధరింపజేసినాడు...

సృష్టిలో వున్న దిగంబరత్వమును పారద్రోలినాడు, విశ్వములోని వారందరి అంగములు {శరీర అవయవములను} ను తన వస్త్రముల చేత అలంకరింపబడుట వలన దేవలున్ని విశ్వాంగః విశ్వాంగుడు అని విశ్వ వస్త్ర ప్రదాత అని కొనియాడ వచ్చును...

ఈ విధముగా దేవలునికి దేవాంగః, మానవాంగః, విశ్వాంగః అని మూడు విధములైన ప్రఖ్యాత నామములు ఉన్నప్పటికి ఈ మూడు పేర్లలో ఏది తగినదిగా వున్నదని ఆలోచించగా రాక్షసులకన్నా మానవులు ఉన్నతులు...

మానవులకన్నా దేవతలు ఉన్నతులు, పుణ్యాత్ములు, కావున అధిక పుణ్యాత్ములు దివ్య స్వరూపులైన దేవతలకే ఇచ్చుట వలనను, మానవులు, దానవులు వారితో సరితూగలేరు కాబట్టి దేవాంగః దేవాంగుడు అని పిలవబడుటయే సముచితముగా వున్నది...

అంతేకాకుండా శివుడు కూడా ప్రప్రథమః దేవాంగుడు అని అతని నోటి నుంచి మాట వచ్చినది, కావున దేవలున్ని దేవాంగుడు అని పిలువబడుటయే సముచితముగా ఉన్నది, దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వస్త్రములను ఇచ్చుట ద్వారా ఈ దేవల ముని ప్రపంచ వ్యాప్త జనుల గౌరవము పొందినాడు...

కావున దేవల చరిత్ర విశ్వములోని సకల జాతుల వారికి సంబంధించిన చరిత్రగా గుర్తింపవలయును, దేవాంగుడు అని పిలువబడినప్పటికి అందరికి సంబంధించిన వాడు అని తేటతెల్లమగుచున్నది, విశ్వ నాగరికతకు పునాదులు వేసిన వాడు అయినవాడు దేవాంగుడు...

దేవాంగ పురాణం {53}

చంద్రరేఖతో దేవలుని వివాహము

మిక్కిలి సుందరమైన రూపముతో అలరారు చుండిన తన కూతురు చంద్రరేఖను దేవలుడికిచ్చి వివాహము చేసినాడు ఆదిశేషుడు, తన కూతురు చంద్రరేఖను వెలకట్టలేని దివ్య రత్నములను అనేకము ఇచ్చినాడు...

అప్పుడు దేవలుడు ఆదిశేషుని వద్ద సెలవు తీసుకొని ఆదిశేషుని కూతురు చంద్రరేఖతో భూలోకమునకు వచ్చెను, కావున దేవలునికి మొట్టమొదటి సారిగా ఆదిశేషుని కుమార్తె చంద్రరేఖతో వివాహమయినది, దేవలుని తొలి భార్యగా చంద్రరేఖనే చెప్పుకొన వలసి యున్నది...

ఈ విధముగా దేవల వంశస్థులకు తమ నాగ జాతి వారికి అవినాభావ సంబంధ మున్నదని దీనిద్వార తెలియు చున్నది, ఈ విధముగా మహా బుద్ది శాలియైన ఆ దేవలుడు ముల్లోకముల యందుండు సమస్త జనులకు వారికి ఆలంకారము కొరకు పెక్కు వస్త్రములను ఇచ్చి వారందరి అభిమానమును పొందినాడు...

దేవాంగ పురాణం {52}

పాతాళ లోకములో వస్త్ర ప్రదానము

ఆ తరువాత దేవలుడు పాతాళ లోకమునకు వెళ్లి అందుండు సర్పరాజులను సందర్శించెను, ఆ పాతాళ లోకమునందలి సర్పరాజుల పడగల యందలి మణుల కాంతి ధగధగ మెరియుచున్నది, ఆ లోకమునంతటను నాగ కన్యలు వ్యాపించి యున్నారు...

మిక్కిలి సుఖకరముగ ఆ ప్రాంతమును పాలించుచుండిన సర్పరాజములు, అచట మహా బలశాలిగా వుండు ఆ సర్పములకు ప్రభువుగా నుండు వాసుకిని చూచి దేవలుడు అతనికి అనేక వర్ణములు గల దోవతులను కోరినన్ని ఇచ్చినాడు...

అక్కడ వుండు చిత్రసేనునికి మంచి దోవతులు ఇచ్చినాడు, ఆ సర్పములకు భర్తయైన తక్షకునికి ఎర్రని వస్త్రములను ఇచ్చెను, అంతేకాకుండా కొన్ని నల్లని వస్త్రములను కూడా తక్షకునికి ఇచ్చి సంతోష పరచినాడు దేవలుడు...

మహా బుద్ధిశాలియగు దేవలుడు ఐరావతమనే సర్ప శ్రేష్టమునకు తెల్లని వస్త్రములను ఇచ్చెను, సౌరభేయము అను సర్పమునకు పసుపు వన్నె ధోవతులు ఇచ్చెను, వైశాలేయములు అను సర్పములు బహు కలవు, అవి కోరిన వస్త్రములను ఇచ్చినాడు...

అచ్చట వున్న మిగతా సర్ప జాతులందరికీ వారు కోరిన వస్త్రములు ఇచ్చినాడు, ఈ విధముగా సర్ప జాతులందరికి వస్త్ర ప్రదానము చేయుట చేత వాసుకి మిక్కిలి సంతోషించెను, దేవలునికి మిక్కిలి వెలగల రత్నములు అనేకములు కానుకగా ఇచ్చినాడు వాసుకి...

అదే విధముగా మిక్కిలి బలముగల చిత్రసేనుడు మొదలగు సర్ప శ్రేష్టుములు మిక్కిలి ప్రేమను పొంది, మనోహరములగు రత్నములను దేవలునికిచ్చి సంతోష పరచిరి, మిక్కిలి బలవంతుడైన దేవలుడు ఆదిశేషుని ఇంటికి వెళ్ళినాడు...

అతనికి చిత్ర వర్ణములగు దోవతులను తెల్లని దోవతులను తమ నల్లని దోవతులను, పసుపు వన్నె దోవతులు మొదలగు వన్నెల దోవతులను ప్రేమతో ఇచ్చినాడు, ఆదిశేషుని భార్యలు అందరికి కూడా వారు కోరునట్టి వస్త్రములను సంతోషముతో ఇచ్చినాడు...

ఆదిశేషుని మంత్రులగు ధృతరాష్టుడు మొదలగు సర్ప శ్రేష్టములన్నిటికి మంచి వస్త్రములు ఇచ్చినాడు, వారి భార్యలకును కావలసిన వస్త్రములిచ్చి వారందరిని సంతోష పరచినాడు, అంతేకాకుండా అక్కడవున్న సర్పములన్నింటికి వారి వారి కోరికననుసరించి వస్త్రములు ఇచ్చినాడు...

అచట వున్న సర్పరాజములన్నియు మిగుల సంతోషమును పొందినవి, కృతజ్ఞతా పూర్వకముగా దేవలరాజునకు అనేక శ్రేష్టములైన దండల చేతను, రత్నముల చేతను, ఆభరణముల చేతను, భూషణముల చేతను మిక్కిలి తేజోవంతుడైన దేవలున్ని సత్కరించి సంతోష పెట్టిరి...

అప్పుడు సర్పము లన్నింటికి ప్రభువైన ఆదిశేషుడు దేవలుడి గుణ గణములు నడవడిని గమనించి మిక్కిలి సంతోషము చెందిన వాడయ్యెను...

దేవాంగ పురాణం {51}

దేవలుడికి బహుకరింపబడిన కానుకలు 

ఓ ధర్మాత్ములైన ఋషులారా వాటి సంఖ్యను తెలిపెదను ఆలకించుము, రధములు కోటి, గోవులచేత నడుపబడు బండ్లు {గాడీలు} రెండు కోట్లు, మదపుటేనుగులు రెండు కోట్లు, మిక్కిలి శ్రేష్టములైన గుర్రములు నాలుగు కోట్లు, పల్లకీలు ఒక కోటి, దాసికలు {స్త్రీ పరిచారకులు} 90 లక్షలు సేవకులు 36 లక్షల మంది, ఈ మనుషులను, ఏనుగులను, గుర్రములను మొదలగు సంపదనంతను ఆమోద పట్టణమునకు పంపినాడు...

పై సంపదను పరిశీలించగా దేవలుడు దేవ, మానవ జాతుల వారి మనస్సులను ఎంతగా ఆహ్లద పరిచినాడో సులభముగా తెలియుచున్నది...

దేవాంగ పురాణం {50}

దేవల, దేవాంగ, మానవాంగః

అనగా దేవతలచేత లాలింపబడుట వలప అనగా స్తోత్రములచే పూజింపబడుట వలన అనగా మా మానములను కాపాడుము మామ కలిగిన సిగ్గును దూరము చేయుము అని పరిపరి విధముల దేవతలచే లాలింపబడుట వలన దేవలః అను ప్రథమ నామము ఏర్పడినది...

తరువాత దివ్య వస్త్రములను  సృష్టించి సకల దేవతల అంగములను తన దివ్య వస్త్రముల చేత అలంకరింప బడుట వలన దేవాంగః అను ద్వితీయ నామము ఏర్పడినది...

దేవతలకు ప్రదానము చేసిన తరువాత భూలోకములో వున్న సకల మానవులందరికి సకల దేశముల యందుండు వారికి వస్త్ర ప్రదానము చేసి మానవుల యొక్క అంగములను తన దివ్య వస్త్రముల చేత అలంకరింప చేసినందుకు వలన మానవాంగః అని కూడా పిలువబడతాడు దేవలుడు...

భూలోకములోని రాజులలో అందరి కన్నా ముందుగా జంబూ ద్వీపమునకు వచ్చినాడు, ఆ జంబూ ద్వీపమును పృధువను రాజు అప్పుడు పాలించుచున్నాడు, ఆతని పట్టణము వజ్ర పట్టణము, ఆ పట్టణమునకు వచ్చి అందుండు రాజు పృధువునకు అనేక వస్త్రములు ఇచ్చి తరువాత ఆ పట్టణమున నున్న జనులందరికి వస్త్రములు ఇచ్చినాడు దేవలుడు...

అనగా పాలకుడి, పాలింపబడే ప్రజలందరికి వస్త్రములు ఇచ్చి వారందరిని మిక్కిలి సంతోష పెట్టినాడు దేవలుడు, అప్పుడు పృధువను రాజు దేవలునికి ఏనుగులు, గుర్రములు, ధనమును, కానుకలను అమితముగా ఇచ్చి అతనిని సంతోష పరిచినాడు, అచ్చట నుండి ప్లక్ష ద్వీపమునకు దేవలుడు వెళ్లి అచ్చట ప్రభుత్వము చేయుచున్న శూరసేనుడు అను రాజుకు దోవతులను ఇచ్చినాడు...

ఆ శూరసేన రాజు కృతజ్ఞతా పూర్వకముగా దేవలునికి మదపుటేనుగులను ఇచ్చి సంతోష పరిచినాడు, అచ్చట నుండి కుశ ద్వీపమునకు దేవలుడు వేళ్ళినాడు, దాని రాజైన కుశడును కలిసి అతనికి సంతోషముతో వస్త్రములను ఇచ్చినందున అతడు గుర్రములను దేవలునికి బహుమానములుగా ఇచ్చి సంతోష పెట్టినాడు...

తరువాత దేవలుడు క్రౌంచ ద్వీపమునకు వెళ్లి అచ్చటి రాజుకు హేమాక్షుడును కలిసి అతనికి నానా వర్ణములగు వస్త్రములను ఇచ్చినాడు, అధిక ప్రతాపవంతుడైన ఆ హేమాక్షుడు మిక్కిలి సంతోషించి దేవలునకు ముత్యములు, ఇంద్రనీల మణులు గుర్రములు, ఏనుగులు, భూషణములను ఇచ్చి సంతోష పరిచినాడు...

అచ్చట నుండి దేవలుడు శాక ద్వీపమునకు వెళ్ళెను, ఆ ద్వీపానికి పాలకుడైన అభిరామునకు వివిధములైన వస్త్రములను ఇచ్చి అతడిచ్చిన రధములు, వాహనములు, సుందరమైన పల్లకీలు, భూషణములు గ్రహించి మిక్కిలి సంతోషించినాడు, తరువాత శాల్మలీ ద్వీపమునకు వెళ్లి అచ్చటి రాజగు శాలిహూత అను రాజునకు మనోహరములగు వస్త్రములను ఇచ్చి అతను ఇచ్చిన అనేక గుర్రములు గ్రహించుకొని అచ్చట నుండి పుష్కల ద్వీపమునకు వెళ్లి అచ్చటవున్న భానుమంతుడు అను రాజునకు దివ్యములైన వస్త్రములను మహా బుద్ది కుశలత గల దేవలుడు ఇచ్చినాడు...

అంతేకాకుండా భానుమంతుడు రాజు ఇచ్చిన గుర్రములను, ఏనుగులను, ఆభరణములను, పలు విధ రత్నములను గ్రహించి మరలా జంబూ ద్వీపమునకు వచ్చినాడు, ఆ తరువాత మాళవ, కొంకణ, ద్రావిడ, మత్సృ దేశములను, కేకయ దేశములను, కళింగ దేశమును, కులంగ దేశమును, చోళ దేళమును, నేపాళ, మాద్ర, సిందు, యుగంధర, విదర్భ, కురు, బర్భర, చైత్య, కురూశ, బంగాళ, త్రిగర్త, ద్రెంకణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘార్జర, శక, సాళ్వ, అంగ, మగధ, జుల్లిక మొదలగు ఎల్ల దేశములకు అనగా రాజ్యములకు వెళ్లి, ఆ దేశముల రాజులకు, అందుండు ప్రజలకు వస్త్రములను ఇచ్చి, వారందరిని సంతోష పరచినాడు దేవలుడు...

అప్పుడు రాజ శిఖామణియైన దేవలుడు పలు దేశముల రాజులు ఇచ్చిన ఏనుగులు, గుర్రములు, ధనము, ఆభరణాలు, పల్లకీలు, బంగారము, రత్నములు, అనేక రకముల ముత్యములు, అనేక రకములైన మణులు, పశువులు, మనోహరములగు రధములు, పెక్కు మంది దాసీ సంఘముల చేతను, పెక్కు పరిచారకులును మొదలగు అమూల్యమైన సంపదను పొంది దీటులేని సంతోషమును  దేవలుడు పొందినాడు...

జంబూ ద్వీపమునందలి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు మరియు ఇతర జనులందరికి దేవలుడు వారు కోరిన వస్త్రములను ఇచ్చి, వారిని సంతోష పరచినాడు, విశ్వమందలి సకల దేవతలు, భూమియందలి సప్త ద్వీపములలోని సకల రాజులకు వారి ప్రజలకు వస్త్రములు ఇచ్చుట చేత వారందరు మిక్కిలి సంతోషము చెందినారు...

అందులకు కృతజ్ఞతా పూర్వకముగా దేవలునికి తమ యధా శక్తీ బహూ కానుకలు సమర్పించినారు అందరు, అందువలన దేవలుడు పొందిన కానుకలు రధములు, పల్లకీలు, ఏనుగులు, గుర్రములు, దాసీలు, సేవికులు, గాడీలు, మిక్కిలి సొగసుగా నుండు పల్లకీలు ఇవి అన్నియు బహు కోట్ల సంఖ్య అయినది ఋషులారా అని సూతుడు చెప్పసాగెను...

1, ఏప్రిల్ 2026, బుధవారం

దేవాంగ పురాణం {49}

దేవాంగుని మర్త్య పాతాళ లోక వస్త్ర ప్రదానము 
     తోమ్మిదవ అధ్యాయము

సూత మహాముని తరువాత కథను ఋషులకు ఈ విధముగా చెప్పుచున్నాడు, మహా శ్రీమంతుడు అగు దేవలుడు దేవలోకములోని వారందరికీ వస్త్రములను ఇచ్చి తరువాత భూలోకమునకు వచ్చినాడు, భూలోకములో వుండు సకల దేశాధీశులకు వస్త్ర ప్రదానము చేసి మానవ నాగరికత వికసింప జేసినాడు...

మనుష్యులను అలంకార ప్రియులుగా చేయుటకు తన వస్త్ర ప్రదానము ద్వారా సృష్టి రమణీయతను బహుగుణీకృతము చేసినాడు, మనుషుల దిగంబరత్వం నుండి నాగరికత వైపుకు పయనించుటకు వస్త్రము ప్రధాన భూషణమైనది, మనుష్యుల యొక్క అంగములనుతన వస్త్రములచే అలంకరింప చేయుటచేత దేవలుడు మానవాంగః అను మరొక ప్రసిద్ధ నామమును పొందెను...

దేవాంగ పురాణం {48}

అష్టదిక్పాలకులకు వస్త్ర ప్రదానము చేయుట 

అచ్చట నుండి అగ్నిదేవుడు వుండు పట్టణమునకు వెళ్ళెను, అతనికి నల్లని వన్నెగల వస్త్రములను ఇచ్చినాడు, అగ్నిహుత్రుడు సంతోషభరితుడై దేవలున్ని సత్కరించినాడు, దక్షిణ దిక్కునందు నివసించు యమధర్మరాజు వుండు పట్టణమునకు వెళ్లి అతనికి నల్లని వస్త్రములను ఇచ్చినాడు, అచ్చటవుండే అతని భక్తులందరకి వస్త్రములను ఇచ్చినాడు, అచ్చట నుండి నైరుతి దిక్కునందు నివసించు నిరృతి అను దిక్పాలకుడు వుండు పట్టణమునకు వెళ్లి పసుపు వన్నెగల దోపతిని ఇచ్చినాడు...

అచ్చట నుండి వరుణుడు వుండు స్థానమునకు వెళ్లి అతనికి తెల్లని వస్త్రములను ఇచ్చి వారిని సంతోష పరిచినాడు, వరుణుడు సంతోషించి మణులచేతను, మిక్కిలి సుందరమైన దండలచేతను దేవలున్ని సత్కరించినాడు, అచ్చట నుండి వాయు దేవుడుండు స్థానమునకు వెళ్లి అతనికి పచ్చని వస్త్రములను ఇచ్చినాడు దేవలుడు, వాయు దేవుడు సంతుష్టా తరంగుడై దేవలున్ని మిక్కిలి గౌరవించినాడు...

అచ్చట నుండి అలకా పట్టణమునకు వెళ్లి కుబేరునకు చిత్ర వర్ణములు గల దోవతి ఇచ్చి సంతోషపరచినాడు, అచ్చటవున్న అతని కుమారుడైన నలకూబరునికి సొగసైన వస్త్రములను ఇచ్చి సంతోషపెట్టెను, అంతట మహాబుద్ధి శాలియగు కుభేరుడు దేవలున్ని మిక్కిలి మనోహరములగు రత్నఖచితములైన మరియు కోటిసూర్యులకు ఎంత వెలుగు వుండునో అంతటి ప్రకాశము గల కిరీటమును మరియు పెక్కు ఆభరణములను ఇచ్చి సత్కరించినాడు...

పిమ్మట ఈశాన్య దిక్కు నందుండు ఈశ్వరుని వద్దకు వెళ్ళీ అతనికి తెల్లని వస్త్రములను ఇచ్చినాడు, అతని వద్దనుండు ప్రమధ గణములకు, భూతములకు మిక్కిలి వెలగల వస్త్రములను ఇవ్వగా వారందరు చాలా సంతోష పడినారు, ఈ విధముగా ధర్మబుద్ధి కలిగి కీర్తిని పెంపొందింప జేసుకొనిన దేవలరాజు స్వర్గ లోకమునకు వెళ్లి అచ్చట వున్న వారందరికీ దివ్యములగు వస్త్రములను ఇచ్చి వారలను సంతోష పెట్టినాడు...

ఈ విధముగా స్వర్గలోకము నందున్న వారందరి అభిమానము పొందెను, కుల పర్వతము నందున్న మహానుభావులకు ఋషులకును, అనేక జాతుల వారికిని వారు కోరిన వస్త్రములను ఇచ్చి వారందరిని సంతోష పరిచినాడు, ఓ ముని శ్రేష్టులారా, ఈ ప్రకారము దేవలుడు దివ్యములైన వస్త్రములను నేసి దేవతల అందరికి ఇచ్చిన వస్త్రములను దేవతలు యొక్క అంగములను అలంకరించుట చేత దేవాంగుడు అని ప్రసిద్ధి చెందినాడు దేవలుడు అని సూతముని చెప్పెను...

దేవాంగ పురాణం {54}

విశ్వజనాంగుడిగా దేవలుడు  అందువలన విశ్వ వస్త్ర సృష్టి కర్తగను, విశ్వ వస్త్ర ప్రదాతగను, విశ్వ వస్త్ర నిర్మాణ ప్రదాత గాను దేవాంగః అను దానితో పా...