ఓ సొగసైన కనుబొమ్మలు కలదానా నీకు నేను ముందే సమాధానము చెప్పితిని, ఇప్పటికిని నీవు ఎన్ని విధములుగా వేడుకొన్నను నా మనస్సు ఇటువంటి కార్యము చేయుటకు ఇష్ట పడదు, ఈ దేహము మల మూత్రములకు పట్టిల్లు, ఈ శరీరము మిక్కిలి నిందితమైనది, మెదడు, మాంసము, ఎముకలు, నరములు, రక్తము, రజ్జువు, ప్రేగులు, పులిసిన నీరు వీని యొక్క సమూహమే ఈ శరీరము...
ఈ శరీరమునకు తొమ్మిది రంధ్రములున్నవి ఈ తొమ్మిది రంధ్రముల నుండి నిరంతరము మలము విసర్జన జరుగుతుంది, అందువలన ఈ దేహము అపవిత్రమైనది, రోగములు ఈ దేహమునకు సర్వ సాధారణముగా కలుగుచుండును, దాని వలన విపరీత భాధను క్లేశమును పొందుచుంటాము, ఈ శరీరము ఇతరుల చేత దర్శింపదగినది కాదు, అనగా నిరంతరము చెమట మొదలగు కలుషితము ఈ శరీరము నుండి బయటకు స్రవింపబడు చుండును...
ఈ దేహము నిత్యమైనది కాదు, నిరంతరము క్షీణించు, నశించు స్వభావము కలదిగా వుండును, ఈ శరీరము జీవునకు భారముగా తోచును, జీవుడు నిరంతరము ఆలోచన పడును, జీర్ణావస్థలో వున్న శరీరము సౌఖ్యాన్ని కలింగించడానికి బదులుగా మిక్కిలి బాధను కలిగించి జీవితముపై విరక్తి భావము కలిగించును, అడుగడుగునా వివిధ రోగములతో కూడిన ఈ శరీరము సౌఖ్యదాయకమైనది కాదు...
ఇది కీడు దుర్భరముగా కూడా తోచును అందువలన ఈ దేహమునకు ఒక స్థిరమైన సుఖము లేదు, అందువలన ఈ దేహము ద్వారా జనించు అల్ప సుఖములకు బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడూ కోరుకోడు, ఈ దేహము వలన పొందు నానావిధ రోగములు వృద్ధాప్యము ఇటువంటివి వుండుట వలన ఈ దేహము ద్వారా వచ్చు సుఖములను వివేక జ్ఞానవంతులు ఆసక్తి చూపరు...
అంతేకాకుండా మరలా పాపము పెరుగుటకు అవకాశముండును, అందువలన ఈ దేహ జనిత సుఖములను అవశ్యం విడువదగినవి, ఈ దేహము పై మమకారాదులు వుంచుకొనరాదు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి